Monday, January 22, 2018

గోదావరి జిల్లాల కవిత్వానికి కొత్త వారసుడు బొల్లోజు బాబా ******************** ఆకెళ్ళ రవిప్రకాష్

ప్రముఖ కవి విమర్శకులు శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ గారు నా కవిత్వంపై ఎంతో ప్రేమతో చేసిన విశ్లేషణాత్మక వ్యాసం ఇది.
ఇంతవరకూ నా కవిత్వంపై వచ్చిన సమీక్షలన్నింటిలోను దీన్ని అపురూపమైనదిగా భావిస్తాను.
ఈ వ్యాసం ఈ నెల పాలపిట్ట సంచికలో ప్రచురింపబడింది.
ఇంత గొప్ప ప్రశంసకు పాత్రుణ్ణి చేసిన రవిప్రకాష్ గారికి సదా నమస్కారములతో
బొల్లోజు బాబా
--------------------------------------------------------------------------------------------------
గోదావరి జిల్లాల కవిత్వానికి కొత్త వారసుడు బొల్లోజు బాబా ******************** ఆకెళ్ళ రవిప్రకాష్
1991 నించి ఏదో ఒక కవిత్వ కాలమ్ లో తరచు తన కవిత్వం కనిపించినా బొల్లోజు బాబా తన మొదటి సంకలనం “ఆకుపచ్చని తడి గీతం” తీసుకు రాడానికి 2009 వరకు ఎదురు చూసాడు. “ సాహితీ యానం” అనే కవిత్వ blog ని అంతకు ముందే ప్రారంభించాడు. 2007 లో యానాం విమోచనోద్యమం 2012 లో ‘ ఫ్రెంచ్ పాలనలో యానాం’ అనే రెండు చారిత్రక పుస్తకాల్ని ప్రచురించాడు. “ఎడారిలో అత్తరులు” అనే సూఫీ కవులవీ, ఇరవై ప్రేమ కవితలు అని పాబ్లో నెరుడా, గాధా సప్తశతి, టాగోర్ Stray Birds ఇవన్నీ అనువాదాలు చేసాడు. 40 పైగా విమర్శనా వ్యాసాలు, ఇపుడు 2017 లో “వెలుతురు తెర” తన రెండో కవితా సంకలనం తో ముందుకొచ్చాడు. పాతికేళ్ళ యితని సాహితీ యాత్రలో గత పదేళ్ళలో అత్యంత చురుకైన కాలంగా గుర్తించవచ్చు. కవిసంగమం వంటి సామాజిక మాధ్యమాలలోనూ ఈ కవి శక్తివంతంగా భాగం తీసుకోవడం చూడొచ్చు.
తూర్పుగోదావరి జిల్లాకు మధ్యన, కోనసీమకు ఆనుకుని వున్న మునుపటి ఫ్రెంచ్ కాలనీ యానాం ఇతని సొంత వూరు. ఇతని తండ్రి గారు బొల్లోజు బసవలింగం గారు యానాం లో ప్రసిద్ధులు. ఫ్రెంచ్ భాషలో పాండిత్యం, యానాం చరిత్ర మీద అనర్గళంగా ప్రసంగించగల శక్తి, సాహిత్యం నాటకం మీద మక్కువతో బసవలింగం గారు నేను యానాం లో పనిచేసినపుడు సుపరిచితులు. ఆరోజుల్లో బాబా దరియాల తిప్ప స్కూల్లో టీచరుగా పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషనులో లెక్చెరర్ గా ఎంపికయ్యి, ఇపుడు కాకినాడ PR కాలేజి లో పనిచేయడం మనకు తెలుసు. తన తండ్రిలాగా అధ్యాపక వృత్తి, ఫ్రెంచి చరిత్ర మీద మక్కువ,సాహిత్యం, కవిత్వంలో నేర్పుకలిగి వీటన్నిటిలో, తండ్రిని మించిన తనయుడు అని చెప్పాలి. ఇప్పటికే తండ్రిగారు చేయక మిగిలి వెళ్ళిన పనులన్నీ చకచకా చక్కబెట్టారనడంలో సందేహం లేదు. సూఫీల మీద, ఖలీల్ జిబ్రాన్, టాగోర్ లాటి సాధు కవులమీద మోజు కలిగిన యితనికి తల్లిదండ్రులు “బాబా” అని సార్థక నామం ఇచ్చారనిపిస్తోంది
.
యానాం నించి బలమైన కవిగా శిఖామణి తెలుగు కవిత్వంలోకి అడుగు పెట్టిన నాటినించి, ఆ భూమి కవిత్వానికి సారవంతమైన ప్రాంతం గా సాగు చేసుకుని వచ్చాడు. శిఖామణి బొల్లోజు బాబా కి మొదటి కవిత్వ గురువు. మొదటి కవిత నించీ, ఇప్పటి వరకు శిఖామణి ఇతని మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ సామాన్యమయినది కాదు. PG చదువుతున్నప్పుడు ఇస్మాయిల్ గారిని కలిసి కవిత్వ తాత్విక చర్చ చేయడం, ఇస్మాయిల్ ఇతని లోని spark ని గుర్తించి తేలిక పదాల ద్వారా కవిత్వ రచన ఎలా చేయవచ్చో తెలియచేయడం యితని కవిత్వ జీవితంలో పెద్ద మలుపు. ఆ రకంగా ఇస్మాయిల్ వీరికి పెద్ద గురువు. ఇతను ఇస్మాయిల్ లా గా నలభైయవ పడిలో ఆలస్యంగా కవిత్వ సంకలనం తేవడం, ఆయన లాగే PR కాలేజి లో పనిచేయడం ఇవన్నీకాకతాళీయమే. గోదావరి జిల్లాల కవులు కృష్ణశాస్త్రి, తిలక్, సోమసుందర్, ఇస్మాయిల్, చిన వీరభద్రుడు, శిఖామణి లకు ఈ తరం వారసుడుగా బొల్లోజు బాబాను గుర్తించవచ్చు. గోదావరి జిల్లాల్లో చదువుకున్న వారు మాట్లాడే సహజ వ్యావహారిక భాష, సరళ మైన, సుందరమైన, శుభ్రమైన తెలుగులో కవిత్వం రాస్తున్న వారిలో బాబా ఒకరు.
కవిత్వంలో నిశ్శబ్దం:
‘ కవిత్వంలో నిశ్శబ్దం’ అనే పదం ఇస్మాయిల్ గారి ద్వారా అందరికీ చిరపరిచితమే. ఇస్మాయిల్ కవిత్వంలో నిశ్శబ్దం ఉంటుందని అందరూ అంటారు. శబ్ద ఆడంబరం (Rhetoric) లేకపోవడం అనేది మాత్రమే కాకుండా visual metaphors తో దృశ్యాల్ని కంటిముందు నిలిపి భావ ప్రకటన చేయడంలో ఇస్మాయిల్ గారిది అందెవేసిన చెయ్యి. సరళమైన, క్లుప్తమైన వ్యక్తీకరణ తో దృశ్యావిష్కరణ ద్వారా కవిత్వాన్ని సౌందర్యంతో నింపడం బాబా కవిత్వంలోకూడా పుష్కలంగా వుంది.
సౌందర్యం .. (ఆకుపచ్చని తడి గీతం)
“ సెలయేటి ఎగువన ఎవరో
నీటిలో వెన్నెల బిందువుల్ని
కలిపారు.
సెలయేరు పొడవునా వెన్నెలే
నీరు తాగలని వంగితే
దోసిట్లో చందమామ”
అక్షరాలతో గీసిన చిత్ర పటాల్లా వుంటాయి ఈ కవితలు. దృశ్యమే కవిత్వం గా మారడమే కవిత్వంలో నిశ్శబ్దం అనొచ్చు.
ఊడుపు (వెలుతురు తెర)
పట్టె తోలిన వరిచేను
ఏది మబ్బు? ఏది కొంగ ?
ఒంగున్న స్త్రీలు
వరి మొలకల్ని
అనంత నీలిమలో
గుచ్చుతున్నారు
ఏది మన్ను ? ఏది మిన్ను ?
ఈ కవితను చూస్తే కళ్ళకి నీళ్ళతో నిండిన వరిచేను దర్శనమిస్తుంది. యిలా నిశ్శబ్ద సౌందర్యం బాబా కవిత్వం నిండా పుష్కలంగా దొరుకుతుంది.
తెరుచుకున్న పద్యాలు:
తెరుచుకున్న కవితలనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఇస్మాయిల్ గారు. కవిత్వం నడకలో చివరివరకు వచ్చే సరికి కొత్త ప్రపంచంలోకి తెరుచుకున్నట్టు వుండడం ఇస్మాయిల్ గారి కవిత్వంలో చూస్తాం. బొల్లోజు బాబా కవిత్వంలో కూడా తెరుచుకునే పద్యాలు అనేకం. ఇస్మాయిల్ గారు పద్యాల్లో రెండు మూడు evolving interconnected metaphors ని, ఎంచుకుంటారు. పద్యం మొదట్లో ఒక రూపకం, చివరి భాగంలో ఒక రూపకం వాడుతూ, చివర లో ఒక metaphor నించి, ఇంకో metaphor కి కవిత నెమ్మదిగా transfer అయినప్పుడు వాడిన సరళమైన పదప్రయోగం ద్వారా చిత్తాన్ని తేలికపరిచి అనుభవాన్ని కలిగించడాన్ని తెరుచుకున్న పద్యం అంటున్నాం. ఈ రహస్యాన్ని బొల్లోజు బాబా చాలా గట్టిగా ఆకళింపు చేసుకుని తన కవిత్వంలో అద్భుతంగా నిర్వహించాడు.
‘ వెలుతురు తెర’ (వెలుతురు తెర సంపుటం లోనిది)
దారాన్ని స్రవించుకుని
కాళ్ళతో పేనుకుంటూ తనచుట్టూ తానే
గూడు నిర్మించుకునే పురుగులా
ప్రతి విద్యార్ధి తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు
గూడులోంచి సీతాకోకచిలుక
మెత్త మెత్తగా బయట పడినట్లుగా
ఒక్కో విద్యార్ధి మాటల ప్రపంచంలోకి
మెలమెల్లగా మేల్కొన్నాడు.
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతో !
ఇలా బాబా కవిత్వంలో ఎన్నోతెరుచుకున్న పద్యాల్ని దర్శించవచ్చు.
కథాత్మక ధోరణి:
ఇతని కవితల్లో కథ చెప్పే ధోరణిలో కవిత్వం నిర్మించడం, అత్యంత చాకచక్యంగా కవితని నిర్వహించడం చూస్తాం. బాబా కవిత్వంలో కవితాత్మక బిగువు ఆద్యంతం సాగుతుంది. ఇతని కవితలో చాలా చోట్ల, కథని metaphor గా నిర్వహించడం చూస్తాం.
“దొరికిన దొంగ” (వెలుతురు తెర)
కొబ్బరికాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారట
చూట్టానికి వెళ్ళాను “
ఇలా అనేక కవితలు చరిత్ర, మార్పు, చర్మం రంగు, పక్కింటబ్బాయి, ఆత్మహత్యా యత్నం, వీటన్నిటిలో కథ ద్వారా అనుభవం కలుగుతుంది.
కథాత్మక ధోరణిలో యిప్పటికే అనేక మంది రాసివున్నా, బొల్లోజు బాబా కవిత్వంలో యిది అత్యంత సహజ సిద్దంగా కనిపిస్తుంది.
నాటకీయ శైలి:
బాబా కవిత్వంలో చాలాచోట్ల కవిత రంగస్థలి మీద నడుస్తున్న నాటక ఫక్కీలో నడుస్తుంది.
చరిత్ర (వెలుతురు తెర)
“ ఈ సొరంగం చివర
వెలుతురు వుండి తీరాలి “ అన్నాడతను
“ ఒకప్పుడు ఉండేదట
చెదలు తినేసాక వెలుతురంతా
అయిపోయింది” అన్నారు కొందరు వృద్ధులు”
ఇలా సంభాషణాత్మకంగా కవిత పొరలు పొరలుగా తెరుచుకుంటుంది. నాటకీయ ఫక్కీలో ఇంత సహజంగా వచనకవితా విన్యాసం సులువైన విషయం కాదు.
Poetry of experience లో నాటకీయ ఫక్కీలో అనుభవాన్ని పాఠకుడుకి చేరవేయడం లో ఆత్మీయత వుంది. అనుభవాన్ని పాఠకులకి గాధంగా చేరవేయడానికి తన పూర్వ అనుభవ కవులు దృశ్యాన్ని, double metaphors ని వాహికగా వాడుకుంటే బొల్లోజు బాబా కాస్త ముందుకు నడిచి కథాత్మక నాటకీయత ద్వారా దృశ్యాల్ని రచింప చేసి తద్వారా అనుభవాన్ని బదలాయిస్తున్నాడు. అనుభువ కవిత్వాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడానికి powerful tools ని సమకూర్చుకున్నాడు.
అద్భుత తాత్వికత
ఆకు పచ్చని తడి గీతంలో గాని, వెలుతురు తెర లో గాని, Fragments అనే పేరుతో కొన్ని కవితా ఖండికలను రాసాడు. నిర్మాణం లో గానీ, శైలి, భాష వీటన్నిటిలో మిగతా కవితల నిర్మాణం కన్నా యివి భిన్న మైనవి. హైకూల కన్నా పెద్దవి. మినీ కవితలు అనవచ్చు. సూఫీ కవులు, ఖలీల్ జిబ్రాన్, టాగోర్ వీరందరి తాత్విక ప్రభావంతో రాసినట్లే వున్నా వీటిలో లోతైన అందం వుంది. బొల్లోజు బాబా లో లోతైన తాత్వికతా చింతనకు Fragments దర్పణాలు. వీటిలో సరళత, గాఢత నన్ను పూర్తిగా వశపరుచుకున్నాయి.
సామాజిక భూమిక
బొల్లోజు బాబా కవిత్వంలో మానవతావాదం, స్వేచ్చావాదం, స్త్రీ వాదం తో కూడిన సరళ సామజిక భూమిక కనిపిస్తుంది. ఇతను సామాజికంగా rebel కాదు. కానీ, నిరంతర చింతనాశీలి. తన నిత్య జీవితంలో స్వానుభవంలోకి వచ్చిన ప్రతి విషయం గురించి సునిశితంగా, దయగా, సూక్ష్మంగా స్పందిస్తాడు. అది ఫీజు కట్టలేక చదువు మానేసిన కుర్రాడు అయినా కావచ్చు, చర్మ రంగు గురించి ఉబ్బిన కళ్ళతో బాధపడిన పాప కావచ్చు. రాత్రిపూట పారిశుభ్య పనివాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలకూ ఉచితంగా సేవలందించే ఆటో ప్రకాష్ కావచ్చు, పోలవరం నిర్వాసితులు కావచ్చు, సగటు మధ్య తరగతి ఉద్యోగిగా వుoటూ, తన చుట్టూ వున్న ప్రపంచం పట్ల నిజాయితీగా, సున్నితంగా, మృదువుగా స్పందిస్తున్న ఒక దయాళువు కనబడతాడు. సామజిక స్పృహ అంటే ఇంతకన్నా ఆశించేది ఏముంటుంది ?
గుండెలు పిండేసే కవితలు
అధ్యాపకుని పాత్రలో బాబా రాసిన అన్ని కవితలూ కూడా ఒక్కొక్కటి ఒక master piece. ఆ కవితలన్నిటికీ నేను దాసోహం అయిపోయాను. “ఎందుకో తెలియటం లేదు” కనే కవితలో ఫీజు కట్టలేక చదువు మానేసిన కుర్రాడు ఆటో తిప్పుతూ ఆ ఆటో కి కూడా యాక్సిడెంట్ అయి రిక్షా తొక్కడానికి సిద్ధపడ్డ పిల్లాణ్ణి చూడలేక ఆ రోడ్ ద్వారా వెళ్ళలేక పోతాడు. అలాగే మూల్యాంకనం, సార్ గారండీ, చర్మం రంగు, నీటి పొర, యివన్నీ కంట తడి పెట్టిస్తాయి. శిఖామణి మువ్వల చేతి కర్ర లోని కొన్ని కవితల్లా నన్ను బాగా కదిలించిందీ, కరిగించిందీ వెలుతురు తెరలోని యీ కవితలే.
సమ్మోహనం
స్త్రీ పురుష బంధాలలోని చిత్రమైన shades ని బాబా చాల బాగా పట్టుకోగలిగాడు. ఈ రకమైన కోణాలు కవిత్వంలో ఇంతకు మునుపు తక్కువ చూసాను.
“ ఆమె మాత్రం చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది” అనడం చిత్రమైన భావనను కలిగించింది.
అలాగే మార్పు అనే కవితలో ఆదర్శప్రాయంగా కాలేజీలోవున్నపుడు ఎంతో అభిమానించిన ఒక అమ్మాయికి old students meet లో చూసి నిరాశ చెంది, చూడకుండా వుంటే బాగుండేది అనడం మరో చిత్రమైన భావన. శ్రీమతి పెళ్ళైన కొత్తల్లో తనకి రాసిన ప్రేమలేఖని కూతురు భలేగా వుందే అని ఆశ్చర్యంగా చూస్తుంటే, అద్భుతంగా వర్ణించిన విషయాలు కాలం గడిచినకొద్దీ బంధం ఎలా పరిణతి చెందుతుందో అద్దం పడుతుంది.
ముగింపు
యానం- గోదావరి జిల్లాల కవిత్వ వారసత్వంలో వెలుగొందిన అనేక గొప్ప కవులు కృష్ణశాస్త్రి, తిలక్, ఇస్మాయిల్, శిఖామణి వీరందరి తర్వాత తరం ప్రతినిధిగా తనదైన ముద్రతో రాస్తున్న కవి బొల్లోజు బాబా. ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం అందుకోవడానికి సర్వదా అర్హుడు. ఇతను కవిగా మరింత ఎదిగి దేశ విదేశాల్లో తెలుగు కవిత్వ బావుటా ఎగురవేస్తాడని ఆశిస్తున్నాను.
-౦-



No comments:

Post a Comment