Sunday, December 31, 2017

చీకటి దిష్టిబొమ్మ


జీవితకాలం శ్రమించి
చిత్రించుకొన్న చిత్తరువులో
కరిగి ప్రవహించే గడియారం
కనుల చివర నిలిచిన అశ్రుబిందువు
వేదనో నవ్వో తెలియని పెదవుల రహస్యలిపి
తుప్పుపట్టిన కిటికీ చువ్వలు
అయిందేదో అయిపోయింది
ఎండిన పూజాపత్రిని ఏట్లో కలిపినట్లు
నిన్ను బాధించిన క్షణాలను మరచిపో.
పట్టుబడిన ఎలుకలను ఊరవతల విడిచినట్లు
నిన్ను బాధించిన వ్యక్తులను మరచిపో.
మాయబుట్టని పొలిమేర చెట్టుకు కట్టినట్లు
నువ్వు బాధించిన సందర్భాలను మరచిపో.
గతాన్నొక గాలిపటం చేసి ఎగరేసి
దాని దారం తెంపేయ్
వెలుతురును అడ్డుకొంటున్న
చీకటి దిష్టిబొమ్మను దహనం చేసేయ్
కొబ్బరి పాకుడు లాంటి మెత్తని గిట్టలతో లేగదూడ
మొదటిసారిగా ఎలా నిలబడుతోందో చూడు
పాదం బరువుకు ఒరిగిన పచ్చిక మెల్లమెల్లగా
ఎలా నిటారుగా తలెత్తుకొంటుందో చూడు
బొల్లోజు బాబా

No comments:

Post a Comment