Thursday, November 9, 2017

లోకం


చక్కగా పరిగెడుతున్నాడు
అందరూ చప్పట్లు కొడుతున్నారు
ఎవరో దారిపై
నూనె కుమ్మరించారు
జారి పడ్డాడు
లేచి నిలబడి
అందరకూ నమస్కరించి
వెనుతిరిగాడతను
ఓటమి అతనిది కాదు
బొల్లోజు బాబా

Tuesday, November 7, 2017

మతం


తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!
మరి ఆయన భక్తులేమిటి
ఇలా కాల్చి చంపుతున్నారు?
వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
ఆశ్చర్యపడక్కర లేదు.
బొల్లోజు బాబా

Friday, November 3, 2017

ఫ్రాగ్మెంట్స్1.
ఆకాశం
తన పెదాలకు
ఏడురంగుల లిప్ స్టిక్
కొట్టుకొంది
2.
ఒంపులన్నీ
సరిగ్గా ఉన్నాయో లేదొ
ఆఖరుసారి అద్దంలో చూసుకొని
బయటకు అడుగుపెట్టింది
నెలవంక
3.
యానాం ఎలా వెళ్లాలి
కాకినాడ మీదుగానా రాజమండ్రి మీంచా?
కవిత్వ సంధ్యను ఎలా చేరుకొన్నా
ఆ సౌందర్యం లోంచి
బయటకు రాలేరు.
4.
ఫెళఫెళార్భాటాలతో
విరిగిముక్కలయింది
ఇంద్రధనుసు
నీవు మౌనం దాల్చటంతో
5.
విద్య మద్యం
ఇక్కడ MRP ధరలకే
అమ్మబడును.
ఉరేసుకోవటానికి "పెర్మిట్ రూమ్"
సదుపాయం కూడా కలదు
బొల్లోజు బాబా

Wednesday, November 1, 2017

అదేహ ప్రేయసి


నీ జ్ఞాపకాలు నిండిన రాత్రివేళ
నిర్నిద్ర దేహం
అస్వప్న జలాలలో పయనించే
గూటి పడవ అవుతుంది.
నీ రూపం, నీ నవ్వు, నీ వీడ్కోలు
నా మూసుకొన్న కనురెప్పల వెనుక
అద్దం ముందు పిచ్చుకలా
రెక్కలు ఆడిస్తూ, పొడుస్తూ,
మిథ్యా ప్రియునితో రమిస్తున్నాయి
బయటకి వెళ్ళిపోండి అని
చెప్పాలనుకొంటాను వాటితో
ఈ భారాన్ని నేను మోయలేను
అని అరవాలనుకొంటాను.
నీ చుంబనంలో బంధీ అయిన
నా పెదవులు తెరుచుకోవు.
నా గొంతులో కూడా
నువ్వే చిక్కుకొని ఉన్నావు.
బొల్లోజు బాబా

Monday, October 30, 2017

ప్రకటన


అమ్మాయి పేరు తేజోమహలట
సంబంధాలు చూస్తున్నారు
పెద్ద అందగత్తె ఏంకాదు
ఒంటినిండా కురుపులు, రోమాలు
మెల్లకన్నూ ఎత్తుపళ్ళు వంకర కాళ్ళూ
ఏ పనీ రాదుట
సోమరి వంకరబుద్దీ అంటారు
జుట్టువిరబోసుకొని దెబ్బలాటలకు దిగటం
స్నేహితుల మధ్య నిప్పులు పొయ్యటం
అడ్డగోలుగా వాదించి గెలవటం హాబీలట
వచ్చే ఎన్నికల్లోగా
ఆమెను ఎలాగైనా ఒకింటిదాన్ని చేయాలట
కట్నకానుకలు భారీగానే ఇచ్చేలా ఉన్నారు
ఏమైనా సంబంధాలుంటే చెప్పండి.

బొల్లోజు బాబా

Friday, October 27, 2017

మూడు అనుభవాలు

మూడు అనుభవాలు ఒక చెవిటివానికి కోయిల పాట ఎలాఉంటుందో వినాలనిపించింది. ఓ కవిమిత్రుణ్ణి అడిగాడు గులాబిపూవులా ఉంటుందన్నాడు. ఒక అందమైన గులాబీని చెవి వద్ద ఉంచుకొన్నాడు మెత్తని పరిమళ స్వరం గులాబి ముళ్ళు చెవితమ్మెల్ని గాయపరిచాయి చేతికి రక్తం వెచ్చగా తగిలింది అనామక కాకి రక్తం ***** ఒక అంధునికి ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనిపించింది సాగరంలా ఉంటుందన్నాడో మిత్రుడు వెంటనే సముద్రంలో దూకేసాడతను గవ్వలు, రాళ్ళు గుచ్చుకొని గాయాలయ్యాయి లోతుల్లోకి కూరుకుపోతూంటే ఒక సముద్రగుర్రం తన వీపుపై ఎక్కించుకొని ఒడ్డున దీబెట్టింది ప్రేమంటే అర్ధమైందతనికి ***** ఒక మూగవానికి దేవుడు కనిపిస్తే ఏం మాట్లాడాలన్న సందేహం వచ్చింది చిమ్మెట శబ్దాలలో నీకు సమాధానం లభిస్తుందన్నారెవరో చిమ్మెటలు కిక్కిరిసిన తోటలో ఎన్నోరాత్రులు ఓపికతో ఒంటరిగా ఎదురుచూసాడతను ఓ వేకువ జామున అతను దేవునితో సంభాషించాడు. బొల్లోజు బాబా

Sunday, August 20, 2017

సృజన

అంతకు ముందు ఏవి లేవో వాటిని కొందరు గొప్ప కాంక్షతో, దయతో అన్వేషించి అక్షరాల్లో మరోప్రపంచాల్ని శిలల్లో భంగిమల్ని రంగుల్లో ప్రవహించే దృశ్యాల్ని ఆవిష్కరిస్తూంటారు వాటిని కొందరు గొప్ప విభ్రమతో, లాలసతో అలా చూస్తూనే ఉండిపోతారు ఏనాటికీ బొల్లోజు బాబా

Friday, July 7, 2017

వలసపక్షుల గానం


ఓ రద్దీట్రాఫిక్ లో
రెండు చీమలు కలుసుకొని
కాసేపు ముద్దులాడుకొని
విడిపోయినట్లుగా మనమూ
కలుసుకొని విడిపోతూంటాం.
ఉద్యోగమో, వివాహమో, అనంతశయనమో
ఏదైనా కానీ
కలయికను లోపలనుంచి తొలిచి
వియోగ శిల్పాన్ని సృష్టించే అద్భుత శిల్పులు.
ఎప్పుడు కలుసుకొన్నామో
సమయాలు సందర్భాలు ఉంటాయికానీ
ఎప్పుడు ఒకరి హృదయంలో ఒకరు
మనుష్యులమై మొలకెత్తామో
తారీఖులు దస్తావేజులు ఉండవు
ఎందుకు కలుసుకొన్నామో
కారణాలు అవసరాలు తెలుస్తుంటాయి
ఎందుకు ఒకరి దూరం
దిగంతాలవరకూ పరుచుకొనే విషాదం
అవుతుందో ఎన్నటికీ తెలియదు
నదిలో కొట్టుకు పోతున్న దుంగపై
కాసేపు వాలి
పేరు, ప్రవర చెప్పుకొనే వలసపక్షులు
చేసే గానమిది.
బొల్లోజు బాబా

Time has come......


కొలతలుగానో మమతలుగానో
చూడబడే ఆమె
నెలకో మూడురోజులు 
ఓ రక్తగర్భ అనీ
రక్తాశ్రువులు చిందించే
ఓ గాయగర్భ కూడా అని
మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది.
ఋతుమతి, పుష్పవతి
ఏకవస్త్ర, త్రిరాత్ర అంటూ
సౌందర్యాత్మక భాషలో కప్పెట్టిన
కొన్ని దైహిక ధర్మాల పట్ల
అసున్నితత్వం పొందాల్సిన సమయం వచ్చింది
ఇన్ సెనిరేటర్ లోకి విసిరిన
నాప్కిన్ తో పాటు
కొన్ని బిడియాల్ని, సంకోచాల్ని
వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది
ఆమెక్కూడా!
.
బొల్లోజు బాబా

నాలుక కథ - Tale of the tongue by K.Satchidanandan


అసత్యమాడబోతున్న నా నాలికను
తెంపి సముద్రంలోకి విసిరేసాను
అది ఓ జాలరి వలలో చిక్కి
రాణిగారి రాత్రిభోజనంలోకి చేరింది
ఆమె కడుపులో ఆ నాలుక పెరగసాగింది
నా స్వరంతో మాట్లాడే బుల్లి యువరాజు
పుట్టాడు కొంతకాలానికి
నాలుక లేకుండా ఉన్న నాపై అసూయచెందిన
రాజుగారు నన్ను చెరసాలలో పెట్టించారు.
సత్యం నన్ను కాపాడటానికి రాలేదు
అసత్యం చెప్పి తప్పించుకొందామంటే
నాలుక లేకుండా పోయింది
బుల్లి యువరాజు పెరిగి పెద్దయి
ఆ అబద్దీకులకు రాజయ్యాడు
అతని వారసులు ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు
నాలుకలేని
నిజాయితీ కలిగిన వృద్ధుడిలా
నేనింకా చెరసాలలోనే ఉన్నాను.
అనువాదం: బొల్లోజు బాబా